సికింద్రాబాద్‌లోఘోర రోడ్డు ప్రమాదం

సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరుమలగిరి నుంచి కార్ఖానావైపు వెళ్తున్న జీహెచ్‌ఎంసీకి చెందిన చెత్త తరలింపు వాహనం తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద టీవీఎస్ ఎక్సెల్‌ను వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఎక్సెల్‌పై ప్రయాణిస్తున్న బన్సీలాల్‌పేటకు చెందిన ఎండీ అజహర్(27), ఆయన కుమారుడు అమన్(9), కుమార్తెలు అశ్వియా(7), అలియా(3) అక్కడికక్కడే మృతిచెందారు. అజహర్ భార్య ఇమ్రాన్‌బేగం, మరో చిన్నారి అదియా తీవ్రంగా గాయపడ్డారు. అదేసమయంలో సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మంత్రి కేటీఆర్ ప్రమాద స్థలంలో కాన్వాయ్‌ను ఆపి బాధితులకు సహాయం చేశారు.

తన కాన్వాయ్‌లోని ఒక వాహనంలో క్షతగాత్రులను సికింద్రాబాద్ యశోదా దవాఖానకు తరలించారు. మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఘటనా స్థలం నుంచి దవాఖానకు వెళ్లారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను మేయర్ ఆదేశించారు. మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *