‘బాహుబలి 2’ క్లైమాక్స్ చెప్పేసిన ‘రాజమౌళి’

మరో 17 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘బాహుబలి 2’ సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కట్టప్ప ‘బాహుబలి’ని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నకు జవాబుతో పాటు బాహుబలి – భళ్ళాల దేవుడు మధ్య జరిగే యుద్ధ సన్నివేశం కోసం సినీ అభిమానులంతా నిరీక్షిస్తున్నారు. ఈ రెండు ఒకదానితో మరొకటి లింక్ అయ్యి ఉండడం విశేషం. ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపినా, దానికి మూలకారణం భళ్ళాలదేవుడే అన్నది స్పష్టం. దీంతో భళ్ళాలపై రివేంజ్ ఏ రేంజ్ లో తీర్చుకున్నాడనేది కూడా ప్రాధాన్యతను దక్కించుకుంది.

అయితే వీరిద్దరి మధ్య యుద్ధ సన్నివేశం ‘బాహుబలి 2’ క్లైమాక్స్ లో వస్తుందని, సినిమా మొదటి నుండి దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ బిల్డప్ అవుతూ వస్తుంటాయని, చివరికి వచ్చేసరికి ప్రేక్షకులు కూడా వీరిద్దరి యుద్ధ సన్నివేశం కోసం ఎదురుచూస్తుంటారని, అంతలా కధలో స్కోప్ ఉందని రాజమౌళి తాజాగా చెప్పుకొచ్చారు. అంటే కధ గురించి కూడా క్లుప్తంగా రాజమౌళి చెప్పేసినట్లే. ‘బాహుబలి 2’ ఫస్టాఫ్ అంతా భళ్ళాలదేవుడు చేసే అకృత్యాలతో నిండి ఉంటుందని, సెకండాఫ్ వచ్చేసరికి ఆ ఏమోషన్ పతాక స్థాయికి వెళ్తుందని జక్కన్న చెప్పకనే చెప్పారు.

ఈ సినిమా నిడివి రెండు గంటల 50 నిముషాలుగా చెప్పిన రాజమౌళి, ఎంత వసూలు చేస్తుందనే దానిపై మాత్రం కాస్త విభిన్నంగా స్పందించారు. మనుషులుగా మనకు కోరిక ఉంటుందని, 1000 కోట్లే కాదు, అంతకుమించి చేయాలన్న ఆశ ఉంటుందని, అయితే ప్రాక్టికల్ గా అది ఎంతవరకు ఇస్తారనేది ప్రేక్షకుల చేతిలో ఉందని, దానిపై నిజంగా తాను ఎక్కువగా ఆలోచించనని, తన దృష్టంతా ఎప్పుడూ ‘సినిమా ఎలా వస్తుంది?’ అన్న దానిపైనే ఉంటుందని చెప్పుకొచ్చారు. రొటీన్ గా సినీ జనాలు చెప్పే దానికి భిన్నంగా రాజమౌళి చెప్పడం… తన స్పెషాలిటీని ఇక్కడ కూడా చూపించడమే కదా..!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *