చిన్నమ్మకు సుప్రీంలో చుక్కెదురు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు దెబ్బమీద దెబ్బలు తగులుతునే ఉన్నాయి. జయ మరణం తర్వాత ఇటు పార్టీని ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని భావించిన చిన్నమ్మకు వరుస షాక్‌లతో సతమతమవుతునే ఉంది. ఇక అక్రమాస్తుల కేసులో తాను లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలని శశికళ చేసిన విజ్ఞప్తిని సుప్రీం తిరస్కరించింది. తీర్పులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేస్తూ మరో షాకిచ్చింది. దీంతో శశికళ ముందు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి.

మనోవైపు జైలుశిక్షను అనుభవించేందుకు సిద్ధమవుతున్న శశికళ, తన పనులను చకచకా చక్కబెట్టుకుంటున్నారు. అన్నాడీఎంకేలో తన పట్టు తగ్గకుండా చూసుకునేందుకు మేనల్లుళ్లను పార్టీలో భాగం చేశారు. 2011లో జయలలిత దూరం పెట్టిన టీటీవీ దినకరన్, ఎస్. వెంకటేశ్ లకు పార్టీలో కీలక పదవులు కట్టబెడుతు నిర్ణయం తీసుకుంది.  దినకరన్ ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. కాగా శశికళ నేడు బెంగళూరులో కోర్టు ఎదుట లొంగిపోనున్న సంగతి తెలిసిందే.

ఇదిఇలా ఉండగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్లపాటు జైలుక్ష విధిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఉదయం తీర్పు వెలువరించింది. 1996లో నాటి జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు మేరకు ఈ కేసు దాఖలైంది. 1991 నుంచి 1996 మధ్య తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత.. ఆదాయానికి మించి రూ.66.65 కోట్ల విలువైన ఆస్తులను పోగేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో జయలలితతోపాటు శశికళ, జె.ఇళవరసి, వి.ఎన్‌.సుధాకరన్‌లను నిందితులుగా పేర్కొంటూ విచారణ మొదలైంది. దీనిపై తొలుత మద్రాస్‌ హైకోర్టులో విచారణ సాగింది.

2001లో అన్నాడీఎంకే మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. దీనివల్ల ఈ కేసు విచారణ నిష్పాక్షికంగా సాగదంటూ డీఎంకే సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది. 2003 నవంబర్‌లో ఈ కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. ప్రత్యేక కోర్టు విచారణ సాగించింది. 2014 సెప్టెంబర్‌ 27న తీర్పు వెలువరించింది. జయ, శశి సహా నలుగుర్ని నిందితులుగా ప్రకటించింది. నాలుగేళ్ల చొప్పున కారాగార శిక్ష, కోట్ల రూపాయల జరిమానాను విధించింది. దీంతో జయ తన పదవికి రాజీనామా చేసి, కొంతకాలం బెంగళూరులోని జైల్లో ఉండాల్సి వచ్చింది. ప్రత్యేక కోర్టు తీర్పును నిందితులు కర్ణాటక హైకోర్టులో సవాల్‌ చేశారు. విచారణ జరిపిన హైకోర్టు 2015 మే 11న దిగువ కోర్టు తీర్పును కొట్టేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *