కోహ్లీ దెబ్బకి కుంబ్లే ఔట్‌… కోచ్‌ పదవికి రాజీనామా

ఒకరు సూపర్‌ స్టార్‌ హోదా ఉన్న కెప్టెన్‌… మరొకరు దిగ్గజ ఆటగాడు… వీరిద్దరు కలిస్తే అద్భుతాలు ఖాయమని అంతా భావించారు. నిజంగానే ఫలితాలు అదే తరహాలో వచ్చాయి. కానీ వాటి వెంట వీరిద్దరు సొంత ‘అహం’ కూడా మోసుకొచ్చారు. ఫలితంగా ఇద్దరు కలిసి పని చేయలేని పరిస్థితి వచ్చేసింది. చివరకు కెప్టెన్‌ పంతమే నెగ్గింది. కోచ్‌ తప్పనిసరిగా తప్పుకోవాల్సి వచ్చింది. భారత జట్టు హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్ట్‌ ప్రకారం ఆయన పదవీ కాలం ముగుస్తున్న మంగళవారం రోజే కుంబ్లే తన నిర్ణయాన్ని వెల్లడించారు. కుంబ్లే ఇష్టపడితేనే విండీస్‌ పర్యటనకు వెళతారని ఇటీవలే సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ వెల్లడించారు.

నిజంగానే కుంబ్లే కొనసాగేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో కోచ్‌ లేకుండా టీమిండియా విండీస్‌ పయనమైంది. ఐసీసీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న కుంబ్లే, ఈ నెల 23 వరకు సాగే ఆ సమావేశాల్లో పాల్గొనేందుకే విండీస్‌ వెళ్లడం లేదని మొదట్లో భావించినా… అది అసలు కారణం కాదని ఇప్పుడు అర్థమైంది. కుంబ్లే రాజీనామాను నిర్ధారించిన బీసీసీఐ, విండీస్‌ పర్యటనలో జట్టును పర్యవేక్షించేందుకు మేనేజర్‌గా హైదరాబాద్‌ మాజీ రంజీ క్రికెటర్‌ డాక్టర్‌ ఎంవీ శ్రీధర్‌ వెళుతున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌కు బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ జట్టుతో పాటు ఉంటారు.

మున్ముందు కొత్త కోచ్‌ ఎంపిక విషయంలో కూడా క్రికెట్‌ సలహా కమిటీ సూచనలు తీసుకుంటామని బోర్డు వెల్లడించింది. పరిణామాలు వేగంగా…: భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీకి బయల్దేరే ముందే కోచ్, కెప్టెన్‌ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. కుంబ్లే ‘శైలి’ శిక్షణ తమకు చాలా ఇబ్బందికరంగా మారిందని జట్టులో కొందరు ఆటగాళ్లు ఫిర్యాదు చేశారు. కనీసం పది మంది కుంబ్లేకు వ్యతిరేకంగా ఉన్నట్లు వినిపించింది. దీనిని బీసీసీఐ పెద్దలతో పాటు కోహ్లి కూడా ఖండించాడు. సరిగ్గా టోర్నీకి ముందు కొత్త కోచ్‌ కోసం బోర్డు దరఖాస్తులు ఆహ్వానించడం కూడా అనుమానాలు రేకెత్తించింది.  అయితే టోర్నీ మొదలయ్యాక అందరి దృష్టి ఆటపైనే నిలిచింది. ప్రాక్టీస్‌ సెషన్ల సమయంలో ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేకున్నా ఫోకస్‌ అంతా సన్నద్ధతపైనే సాగింది. అయితే టోర్నీ ముగిశాక మరోసారి ముందుకొచ్చిన ఈ అంశం కుంబ్లే నిష్క్రమణ దాకా సాగింది.

శనివారం కోహ్లితో సమావేశమైన సలహా కమిటీ సభ్యులు, బోర్డు అధికారులు సోమవారం కుంబ్లేతో కూడా మాట్లాడారు. ఈ భేటీలో కుంబ్లే ఆసాంతం ‘నాకు, కోహ్లికి మధ్య ఎలాంటి సమస్యా లేదు’ అనే చెబుతూ వచ్చారు. అయితే కోహ్లి తమతో చెప్పిన విషయాలన్నీ కుంబ్లే ముందు ఏకరువు పెట్టడంతో కథ మారిపోయింది. అంతా విన్న తాను ఇక కొనసాగలేనంటూ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు కొత్త కోచ్‌ వేటలో అందరి దృష్టి మరో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌పై నిలిచింది. విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు ఉన్నా, కోచ్‌గా అతను ఏ మాత్రం పనికొస్తాడో చెప్పలేం. టామ్‌ మూడీ, లాల్‌చంద్‌ రాజ్‌పుత్, రిచర్డ్‌ పైబస్, దొడ్డ గణేశ్‌ కూడా కోచ్‌ రేసులో ఉన్నారు.
ఎవరికి నష్టం?
కోచ్‌ జాన్‌రైట్‌తో కలిసి చక్కటి ఫలితాలు సాధించిన కెప్టెన్‌ గంగూలీకి గ్రెగ్‌ చాపెల్‌తో మాత్రం ఎందుకు పడలేదు? సచిన్, కపిల్‌ల మధ్య సమన్వయం ఎందుకు కుదరలేదు?
రైట్‌తో పోలిస్తే చాపెల్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌లలో ఒకడు. గంగూలీకంటే అద్భుతమైన రికార్డు అతనిది. రైట్‌ సర్దుకుపోగా… చాపెల్‌తో ‘ఇగో’ సమస్యలు వచ్చాయి. సచిన్, కపిల్‌ విషయం కూడా ఇంతే. ఇద్దరు అగ్రశ్రేణి వ్యక్తులు కలిసి పని చేస్తే ఎదురులేని ఫలితాలు సాధించవచ్చని అనిపిస్తుంది. కానీ దాంతోపాటు సర్దుబాటు సమస్య కూడా ఉంటుంది. కోచ్, కెప్టెన్‌లలో ఇద్దరికీ సొంత ఆలోచనలు ఉంటాయి.

ఒకరికి సరైనదిగా అనిపించింది మరొకరికి తప్పుగా తోచవచ్చు. విభిన్న అభిప్రాయాలు ఉండటంలో తప్పు లేదు అంటూ ఇద్దరూ గొడవ లేకుండా పని చేసే ప్రయత్నం చేస్తారు. కానీ రాన్రానూ అది అసాధ్యంగా మారిపోతుంది. కోహ్లి, కుంబ్లే మధ్య కూడా అదే జరిగింది. కోహ్లి ఆటగాళ్లకు స్వేచ్ఛను కోరుకునే రకం. అందుకే అతను ‘ఫ్రెండ్లీ’ రవిశాస్త్రిలాంటి వ్యక్తిని కోచ్‌గా కావాలనుకున్నాడు. కానీ ఏ స్థాయి ఆటగాడైనా శ్రమించేందుకు వెనుకాడవద్దనేది కుంబ్లే తత్వం. అందుకే ఆటగాళ్లంతా కలిసి అతడిని ‘హెడ్‌ మాస్టర్‌’గా చిత్రీకరించారు. ఆ కఠోర సాధన తమ వల్ల కాదని చేతులెత్తేశారు. ఈ మైదానంలోని అంశాలు కాకుండా ఇద్దరి మధ్య విభేదాలకు ‘వ్యక్తిగత’ కారణాలు ఏమైనా ఉన్నాయేమో ప్రస్తుతానికైతే తెలీదు. మధ్యలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా బీసీసీఐ అధికారులు తమ పాత్ర పోషించారు.

కోచింగ్‌తో సరిపెట్టకుండా ఆటగాళ్ల ఫీజు పెంచడంవంటి అంశాల్లో దూకుడుగా ముందుకు వెళ్లటం వారిలో చాలా మందికి నచ్చలేదు. దాంతో రోగి కోరిందే వైద్యుడు ఇచ్చాడు అన్నట్లుగా… ఇటు తన మాటే చెల్లుబాటు కావాలనుకుంటున్న కోహ్లి వ్యతిరేకతకు బోర్డు ఆలోచన కూడా తోడై కుంబ్లేను సాగనంపారు. క్రికెట్‌లో కోచ్‌ పాత్ర తక్కువే కావచ్చు… కానీ ఆటగాడిగా, కెప్టెన్‌గా ‘జెంటిల్‌మెన్‌’ ఇమేజ్‌ సంపాదించిన కుంబ్లే కోచ్‌గా ఉండటం జట్టుకు కచ్చితంగా మేలు చేసే విషయం.

అతని సేవలను కోల్పోతే నష్టపోయేది కుంబ్లే మాత్రం కాదు. మాజీ క్రికెటర్‌ బిషన్‌ సింగ్‌ బేడి తాజా పరిణామాన్ని విశ్లేషిస్తూ  ‘ఆత్మగౌరవం ఉన్న కుంబ్లే లాంటి వ్యక్తి అక్కడ పని చేయలేడు. అతనిపై తిరుగుబాటు చేస్తున్నవారంతా కృతజ్ఞత లేనివారే. చివరకు భారత క్రికెట్టే నష్టపోతుంది’ అని వ్యాఖ్యానించడం కుంబ్లే విలువను చూపిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *