టెక్నాలజీతో మహిళలకు అపార అవకాశాలు

సాంకేతిక రంగం అభివృద్ధితో మహిళలకు, మహిళా పారిశ్రామికవేత్తలకు అపార అవకాశాలు అందుబాటులోకి వచ్చినట్లు ఇవాంక ట్రంప్ అన్నారు. జీఈఎస్ రెండోరోజు ప్లీనరీ సమావేశాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సాంకేతిక విభాగంలో మహిళా పారిశ్రామివేత్తలకు అవకాశాలు ఉన్నాయన్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా కుటుంబాలకు అండగా ఉంటున్నారని తెలిపారు. నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నూతన ఆవిష్కరణలన్నీ ప్రైవేటు రంగంలోనే వస్తున్నాయని.. ఏ రంగంలోనైనా సేవలు బాగుంటేనే ఆదరణ ఉంటుందని ఆమె తెలిపారు. స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను మహిళా కోణంలో చూడవద్దని సమాజంలో సగభాగమైన వారి సమస్యలను క్లిష్ట సమస్యలుగా భావించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇంటినుంచే పనిచేసే అవకాశం ఇవ్వాలి: చందాకొచ్చర్
మహిళలకు ఇంటినుంచే పనిచేసే అవకాశాలను మరింత మెరుగుపరచాలని ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్ అన్నారు. రెండో రోజు జీఈఎస్ ప్లీనరీ సమావేశాల్లో చందా కొచ్చర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చాలామంది మహిళలు కెరీర్‌ను వదులుకుంటారన్నారు. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో కెరీర్‌ను వదులుకునే ఆలోచన చేయొద్దని మహిళలను ఆమె కోరారు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపినప్పుడే ముందుకు వెళ్లగలమన్నారు. వృద్ధులు, పిల్లలను చూసుకుంటూ మహిళలు ఇంటి నుంచి పనిచేయవచ్చని చెప్పారు. సాంకేతికను వినియోగించి ఇంటినుంచి పనిచేసే అవకాశాలు ఇవ్వాలని ఆమె కోరారు. మహిళలు విద్యావంతులైతే ఒక తరం మొత్తం విద్యావంతమైతదన్నారు.

పెరిగిన మహిళా భాగస్వామ్యం..
సీఎస్‌ఆర్ ద్వారా మహిళాభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి మరిన్ని శిక్షణ కేంద్రాలు అవసరమన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాటి అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామీణరంగ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. తాము శిక్షణ ఇచ్చినవారిలో 95 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. తన పిల్లలే తనకు పెద్ద స్ఫూర్తి అని చందాకొచ్చర్ చెప్పుకొచ్చారు. విద్య, ప్రోత్సాహం, సాధికారత ఉంటే మహిళలు ఏదైనా సాధిస్తారన్నారు. భారతదేశంలో మహిళా భాగస్వామ్యం చాలా పెరిగిందన్నారు. బ్యాంకింగ్ రంగంలో 40 శాతం మహిళలు పనిచేస్తున్నారు. దేశం నుంచి మహిళా క్రీడాకారిణులు అన్ని విభాగాల్లో ఉన్నారని తెలిపారు. నేడు భారతదేశ రక్షణశాఖ మంత్రి మహిళా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. 7-8 ఏళ్లలో భారత జీడీపీ 700 బిలియన్ డాలర్లకు చేరుకోబోతున్నట్లు పేర్కొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *