పాస్‌పోర్టు ధ్రువీకరణలో తెలంగాణ బెస్ట్

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అరుదైన ఘనతను సాధించింది. పాస్‌పోర్టు ధ్రువీకరణలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణ పోలీసుశాఖకు జాతీయ అవార్డు లభించింది. శుక్రవారం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఢిల్లీలో ఈ అవార్డును హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డికి అందజేశారు. పాస్‌పోర్టు చట్టం అమల్లోకి వచ్చి యాభై ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన పాస్‌పోర్టు దివస్‌ను పురస్కరించుకుని తెలంగాణ పోలీసుశాఖకు ఈ అవార్డును అందజేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే మరే రాష్ట్రంలో లేనివిధంగా కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే పాస్‌పోర్టు ధ్రువీకరణ ప్రక్రియను ముగించి మంచి ఫలితాలను సాధించినందుకు ఈ అవార్డు లభించింది.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగిస్తూ, పాస్‌పోర్టు పోలీసు ధ్రువీకరణలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ రాష్ట్రం ఏ విధంగా మంచి ఫలితాలు సాధించిందో తెలుసుకుని ఇతర రాష్ర్టాలు కూడా ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో, ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ప్రజలకు పాస్‌పోర్టు అవసరాలు వివిధ కారణాలరీత్యా పెరుగుతున్నాయని, ఒకప్పుడు ఇది గౌరవప్రదమైన అంశంగా ఉండేదని, కానీ ఇప్పుడు అవసరంగా మారిందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పోలీసులు అద్భుత ఫలితాలను సాధించారని పేర్కొన్నారు. పాస్‌పోర్టు ధ్రువీకరణ ప్రక్రియలో ఏ గ్రేడ్‌లో 12, బి గ్రేడ్‌లో12, సి గ్రేడ్‌లో 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకు పాస్‌పోర్టులను కేవలం ఇంగ్లిష్ భాషలోనే ముద్రిస్తున్నామని, ఇకపైన హిందీలోనూ ఉండే విధంగా నాసిక్‌లోని ముద్రణాలయానికి ఆదేశాలు జారీ చేశామని సుష్మాస్వరాజ్ తెలిపారు. కొత్తగా జారీ అయ్యే పాస్‌పోర్టులన్నీ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటాయని స్పష్టంచేశారు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా దాదాపు కోటి పాస్‌పోర్టులను జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిదేండ్ల వయసులోపున్న పిల్లలకు, అరవై ఏండ్ల వయసు దాటిన వృద్ధులకు పాస్‌పోర్టు రుసుములో 10శాతం తగ్గింపు ఇస్తున్నామని చెప్పారు.

అనాథలకు తల్లిదండ్రుల పేర్లు, పుట్టినతేదీ తదితర వివరాలకు సంబంధించిన ఆధారాలు ఉండవు కాబట్టి సంబంధిత సంరక్షణాలయాలు లేదా ప్రభుత్వ అధికారుల ధ్రువీకరణతో పుట్టినతేదీ, చిరునామా వివరాలతో పాస్‌పోర్టులను జారీ చేస్తున్నట్లు వివరించారు. భార్యాభర్తల మధ్య వివాహబంధం చెదిరిపోయి మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్లయితే పాస్‌పోర్టు దరఖాస్తుల్లో నిర్బంధంగా భర్త పేరు పెట్టాల్సిన అవసరం లేకుండా తల్లి లేదా తండ్రి పేరు ఉంటే సరిపోతుందనే తీరులో నిబంధనలను సరళతరం చేసినట్లు సుష్మాస్వరాజ్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో పాస్‌పోర్టు అత్యవసరం అయినప్పుడు ముందుగా జారీ చేసి ఆ తర్వాత పోలీసు ధ్రువీకరణను చేసే విధంగా కొన్ని షరతుల మేరకు నిబంధనలను మార్చినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో గతేడాది 3,85,558 మంది పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారని, ధ్రువీకరణ ప్రక్రియను తెలంగాణ పోలీసు విభాగం సగటున కేవలం ఐదు రోజుల్లోనే పూర్తి చేసి దరఖాస్తుదారులకు పాస్‌పోర్టు అందించగలిగిందని విదేశాంగశాఖ అధికారులు తెలిపారు. మొత్తం దరఖాస్తుల్లో 99శాతం పాస్‌పోర్టుల ధ్రువీకరణ ప్రక్రియను కేవలం ఐదు రోజుల్లోనే పూర్తి చేసిందని, ప్రస్తుతం 7,861 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పాస్‌పోర్టుల ధ్రువీకరణ పెండింగ్ విషయంలో దేశంలోనే తెలంగాణ కనిష్ఠస్థాయిలో నిలిచిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సగటున పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు పది రోజుల సమయం పడితే తెలంగాణలో మాత్రం కేవలం ఐదు రోజులే ఉన్నదని వివరించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *