టీ క్యాంప్ ఆఫీసు సాక్షిగా మంత్రులకు అవమానం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన నివాసం మరోమారు వార్తల్లోకి ఎక్కింది. గతంలోనే శత్రు దుర్బేద్యమైన నిర్మాణంగా వార్తల్లోకి ఎక్కిన ప్రగతి భవన్ ఇప్పుడు ఏకంగా కేబినెట్ మంత్రులకు చుక్కలు చూపించే ప్రాంగణంగా మారిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మాన్యులైన మంత్రులు మొదలుకొని సామాన్యుల వరకు ప్రగతి భవన్ లో అంతా సమానమేనని అంటున్నారు. ఎవరైనా సరే ముందస్తుగా అనుమతి తీసుకుంటేనే లోనికి ప్రవేశం ఉంటుంది. సాధారణ పౌరులు మొదలు మంత్రులు – ఎమ్మెల్యేలు – ఐఎఎస్ లు – ఐపీఎస్ లందరూ ముందుగా అనుమతి తీసుకోవాల్సిందేనని అంటున్నారు. ఒకవేళ అనుమతి లేకుండా ప్రగతి భవన్ – సీఎం క్యాంప్ కార్యాలయంలోకి ఎవరు వెళ్ళినా ఎట్టి పరిస్థితులలో అనుమతించరని టాక్ వినిపిస్తోంది.

ఇటీవలి కాలంలో కొందరు మంత్రులు – ప్రధాన కార్యదర్శి హోదా గల ఉన్నతాధికారులు – చట్టసభల సభ్యులకు క్యాంప్ కార్యాలయం వద్ద ఎదురైన పరాభవాలపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మంత్రి సీఎం కేసీఆర్ ను కలిసేందుకు బేగంపేటలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారు. ప్రధాన గేటు వద్దే అయన వాహనాన్ని నిలిపి వేశారట. `సీఎంను కలవడానికి వెళ్తున్నా లోనికి అనుమతించండి` అని మంత్రి చెప్పగా సీఎం మిమ్మల్ని పిలిచారా అని భద్రతా సిబ్బంది ప్రశ్నించారట. అపాయింట్మెంట్ తీసుకోలేదని లోనికి వెళ్ళాలని మంత్రి అనగా అలా పంపించడం కుదరదు అంటూ నిష్కర్షగా తిప్పి పంపారని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు వేర్వేరు సమయాల్లో గత నెలలో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు క్యాంప్ ఆఫీసు వద్దకు వెళ్ళగా….ప్రధాన గేటు వద్దే మంత్రి వాహనాన్ని భద్రతా సిబ్బంది నిలిపివేశారు. అప్పాయింట్ మెంట్ తీసుకున్నారా అని అడగ్గా లేదు తన శాఖకు సంబంధించి విషయాలపై మాట్లాడేందుకు వచ్చానని సమాధానమిచ్చారు. వెంటనే వైర్లెస్ సెట్లో క్యాంప్ కార్యాలయం సిబ్బందితో మాట్లాడారు. సదరు మంత్రి కలిసేందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని చెప్పడం ఆ విషయాన్ని మంత్రికి తెలియచేయడం అక్కడే జరిగిపోయాయి. ఆ మంత్రి గేటు ముందు నుంచే తిరుగుముఖం పట్టాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.

ఉన్నత అధికారులకు సైతం ఇదే అనుభవం ఎదురవుతోందని అంటున్నారు. ఈ సంఘటనకు కొద్ది రోజుల ముందు ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన ఒక సీనియర్ అధికారి సీఎంను కలిసేందుకు క్యాంప్ కార్యాలయానికి వెళ్ళగా ఆయనకు కూడా ఇదే రీతిలో సమాధానం ఎదురైంది. తన హోదాని చెప్పినప్పటికీ భద్రతా సిబ్బంది ఏమాత్రం విన్పించుకోలేదని దీంతో సదరు అధికారి వెనక్కు తిరిగి వచ్చారని అంటున్నారు. మొత్తంగా క్యాంప్ కార్యాలయం వద్ద ప్రముఖులందరికీ ఈ అవమానాలు ఎదురవుతున్నట్లు హాట్ హాట్ చర్చ సాగుతోంది. అపాయింట్మెంట్తో వెళ్తే తప్ప క్యాంప్ కార్యాలయం ఆవరణలోకి అడుగిడే ప్రసక్తి లేదనేది అందరి మాట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *