తెలంగాణ పాలిటిక్స్‌ యూ టర్న్‌ తీసుకుంటాయా?

మొన్నటి వ‌ర‌కు సింగిల్ హ్యాండెడ్‌గా సాగిన రాజ‌కీయాలు ఇపుడు స‌డెన్‌గా ట్రయాంగిల్ ట‌ర్న్ తీసుకున్నాయి. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌కు తోడు బీజేపీ రేసులోకి రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఒంట‌రిగా పోటీ చేసి గెలుస్తామ‌న‌డం.. స‌ర్వేలు చేసి అభ్యర్థుల‌ను ఎంపిక చేయ‌డం, ప‌క్క పార్టీ నేత‌ల‌ను లాగేందుకు స్కెచ్ వేయ‌డం.. ఇపుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే తెలంగాణ మూడు రోజులు తిష్ట వేయ‌డం చూస్తుంటే.. ఇది బీజేపీ వ్యూహరచన ఏమిటో అర్థం కాక అధికార పార్టీ తలపట్టుకుంటుంది. నిజంగానే బ‌లం ఉండి ఇలా చేస్తున్నారా..? సొంతంగా అధికారం ద‌క్కించుకునేంత సీన్ ఉందా..? అస‌లు ఇక్కడ బీజేపీకి భ‌విష్యత్ ఉందా..? ఇలా ఒక్కటేమిటీ.. అనేక ప్రశ్నలు గులాబీ అధినేత‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ్‌‌. అందుకే ఇపుడు ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై మూడో విడ‌త స‌ర్వేకు సిద్ధమ‌య్యారు.

ఇది ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై అని చెబుతున్నా.. గ్రౌండ్‌లో సీన్ మాత్రం వేరేలా ఉంద‌ట‌. బీజేపీ బ‌లమెంటో కనుక్కోవాల‌ని స‌ర్వే చేసే కంపెనీకి చెప్పార‌ట‌. నిజంగానే అంత‌లా బీజేపీకి బ‌లం ఉందా..? ఒంట‌రిగా పోటీ చేసి గెలుస్తారా..? ఎంత మంది క‌మ‌లం కండువ క‌ప్పుకోవ‌చ్చు. ఇంకెంత మంది వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా అనేక సందేహాలను నివృత్తి చేయాల‌ని సూచించార‌ట‌. ఈ స‌ర్వే రెండు వారాల పాటు సాగ‌నుంది. ఈ లోపు అమిత్ షా ప‌ర్యట‌న ముగుస్తుంది. నిజంగానే బీజేపీకి బ‌లం ఉందో లేదో ఈ స‌ర్వేలో తేలుతుంద‌ని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీకి అంత సీనుంటే ఏ మాత్రం తక్కువ అంచ‌నా వేయొద్దని.. వెంట‌నే రంగంలోకి దిగాల‌ని చూస్తున్నార‌ట‌. ఇప్పటికే బీజేపీ పెద్దగా విమ‌ర్శించ‌డం లేదు కాబ‌ట్టి.. త‌మ‌కు పోటీ అనుకుంటే విమ‌ర్శలు త‌ప్పవ‌ని చెబుతున్నార‌ట‌. దీంతో మూడో స‌ర్వేపై టీఆర్‌ఎస్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *