కేసీఆర్ కు టెన్షన్ మొదలైందా…?!

ఇదిగో వస్తున్నా.. అన్నట్టుగా ప్రకటన చేసి, హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నాడు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఈయన హైదరాబాద్ లో అడుగుపెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందూ ఓట్లను పోలరైజ్ చేయడానికి అత్యంత అనుకూల ప్రాంతం హైదరాబాద్. అలాంటి చోట్ల షా అడుగుపెట్టాడంటే.. బీజేపీకి అంతకు మించిన ఆనందం ఉండదు. ఏ సమీకరణాలను ఆధారంగా చేసుకుని యూపీ లో బీజేపీ సంచలన విజయాలు సాధిస్తోందో.. హైదరాబాద్ లోనూ అచ్చం అలాంటి రాజకీయానికి అవకాశం ఉంటుంది.

కేవలం హైదరాబాద్ అనే కాదు.. యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో షా తన స్ట్రాటజీకి ఇక్కడ కూడా పదును పెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై షా త్వరలోనే కసరత్తు చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పక్క పార్టీల్లోని నేతలను చేర్చుకోవడం కూడా షా వ్యూహాల్లో ముఖ్యమైనది.

ఇందు కోసంకొంతమంది కాంగ్రెస్ నేతలను షా క్యూలో పెట్టాడని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వాళ్లను చేర్చుకోనున్నాడని, స్థూలంగా రెడ్డి క్యాస్ట్ మీద షా కన్నేశాడని.. వారిని బీజేపీ వైపు మళ్లించే యత్నం చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. తెరాస అంటే పడని వర్గాలు, హిందూ ఓట్లు.. వీటిని కలుపుకుపోవాలనేది షా వ్యూహంగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రెడ్లకు రాజకీయ ప్రధాన్యతను ఇవ్వడంతో పాటు.. హిందుత్వ మంత్రం ద్వారా ఇతర కులాల్లోని అన్ని వర్గాలనూ బీజేపీ వైపు తిప్పే యత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ వ్యూహంతోనే షా త్వరలోనే తెలంగాణలో దిగబోతున్నాడని.. హైదరాబాద్ పర్యటనకు డేట్ ప్రకటించి, ఆ వెంటనే దాన్ని వాయిదా వేసి.. ఇక్కడి పార్టీలకు ఝలకిచ్చాడని అంటున్నారు. మరి ఇప్పడు షా రంగంలోకి దిగడం ప్రధానంగా అధికార తెరాసను ఇబ్బంది పెట్టే అంశమే. కాంగ్రెస్, తెలుగుదేశంలు నిర్వీర్యం అవుతున్న దశలో కమలం గేమ్ ను మొదలుపెడితే.. దెబ్బ తెరాస కే కదా. అందుకే తెరాస అధినేతకు టెన్షన్ మొదలైంది!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *