తమిళనాడు సీఎం శశికళ ? లోక్ సభ డిప్యూటీ స్పీకర్: తంబిదురై

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సొంత పార్టీలోని నాయకులు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఆయన ఎందుకు సీఎంగా ఉన్నారో అనే విషయం ఆయనకే అర్థం కాకుండాపోయిందని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన శశికళకు ఇప్పుడు సీనియర్ నేతలు అందరూ చిన్నమ్మ మీరే సీఎం కావాలని కాళ్లమీదపడిపోవడంతో పన్నీర్ సెల్వం వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కాకపోవడంతో సతమతం అవుతున్నారు.

అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఇప్పుడు శశికళ సీఎం కావాలని కొత్తగా నినాదం చెయ్యడంతో పన్నీర్ సెల్వం వర్గీయులు ఉలిక్కిపడ్డారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మొదట పోటిపడిన వారిలో తంబిదురై మొదటి వరసలో ఉన్నారు.

అయితే చివరికి పార్టీలోని సీనియర్ నాయకులు అందరూ కలిసి శశికళను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కుర్చోబెట్టారు. అన్నాడీఎంకే పార్టీ చీఫ్ పదవితో పాటు సీఎంగా చిన్నమ్మ శశికళ ఉండాలని ఆమె వర్గీయులు ఇంత కాలం పాటపాడుతూ వచ్చారు.

ఈ విషయంపై లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాత్రం స్పందించలేదు. సోమవారం మీడియాతో మాట్లాడిన తంబిదురై తమిళనాడు సీఎంగా శశికళ ఉంటే అమ్మ జయలలిత ఆశయాలు నేరవేర్చడానికి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పారు.

జయలలిత చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలంటే చిన్నమ్మ శశికళ సీఎంగా పని చెయ్యాలని, అప్పుడే తమిళనాడు ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పార్టీలో సీనియర్ అయిన తంబిదురై వెంట శశికళ సీఎం కావాలని మాట వినపడటంతో పన్నీర్ సెల్వం వర్గీయులు మరింత ఆందోళనకు గురైనారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *