శ్రీనివాసుడి సన్నిధికి సీఎం కేసీఆర్…..

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రేపు తిరుమలకు వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమల వెంకటేశ్వరస్వామిని, విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటిని తీర్చేందుకు సమాయత్తమవుతున్నారు.

శ్రీ వేంకటేశ్వరస్వామిని బుధవారం రోజున కేసీఆర్‌ దర్శించుకుని బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు ఆభరణాలను సమర్పిస్తానని మొక్కుకున్న కేసీఆర్‌.. రూ.5 కోట్లతో వాటిని తయారు చేయించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు కలిసి రెండు ప్రత్యేక విమానాల్లో తిరుపతి చేరుకోనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం తిరుమల చేరుకుంటారు. సీఎం, ఆయన కుటుంబ సభ్యులు శ్రీకృష్ణ, శ్రీవత్సం విశ్రాంతి గృహాల్లోను, మంత్రులు శ్రీ, లైలావతి, మణిమంజరి, టీఎస్‌ఆర్‌ విశ్రాంతి గృహాల్లోనూ బస చేస్తారు.

బుధవారం ఉదయం కేసీఆర్‌ దంపతులు మహాద్వారం గుండా, మంత్రులు, అధికారులు మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయంలోకి వెళతారు. అందరూ కలిసి స్వామి వారికి బంగారు ఆభరణాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారు.

స్వామివారికి కేసీఆర్‌ మొక్కు మేరకు తయారు చేయించిన ఆభరణాలను బుధవారం తిరుమలకు చేర్చనున్నారు. ఆభరణాల కోసం తెలంగాణ ప్రభుత్వం నగదును టీటీడీకి జమ చేయగా.. అందులో రూ.3.7 కోట్లతో 14.2 కిలోల స్వర్ణ సాలగ్రామహారం, రూ.1.21 కోట్లతో 4.65 కిలోల కంఠాభరణాన్ని తయారు చేయించి… టీటీడీ ఖజానాలో భద్రపరిచారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన ఖరారైన నేపథ్యంలో వీటిని కట్టుదిట్టమైన భద్రత నడుమ తిరుమలకు చేర్చాలని టీటీడీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఒకవేళ కేసీఆర్‌ కోరితే మంగళవారం రాత్రే ఆభరణాలను తిరుమల చేర్చడానికి టీటీడీ సిద్ధంగా ఉంది. కేసీఆర్‌ తిరుమల తిరుపతి పర్యటన నెపథ్యంలో శాంతిభద్రతలను పరిశీలించేందుకు తెలంగాణ ఇంటెలిజెన్స చీఫ్‌ నవీనచంద్‌, హైదరాబాద్‌ ఐజీ ఎంకే సింగ్‌ సోమవారం రోజున తిరుమలకు చెరుకున్నారు. స్వామి వారి దర్శన అనంతరం ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఆతిథ్యమివ్వనున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *