పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. పవన్‌ పేరు ఎత్తకుండా ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఉత్తరాది పెత్తనం అంటూ అనవసర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిందని పవన్‌కు పరోక్షంగా హితవు పలికారు. శనివారమిక్కడ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

దేశం అంతా ఒక్కటే అన్నది బీజేపీ సిద్ధాంతమని, ఇంకా ఉత్తరాది, దక్షిణాది ఏంటి? తెలుసుకోకపోతే ఎలా? అంటూ పవన్‌ను పరోక్షంగా ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం పద్ధతి కాదన్నారు. దేశంలో ప్రధాని మోదీ పలుకుబడి రోజురోజుకు పెరిగిపోతున్నదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను మించిన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని, అయినా పెట్టుబడులు పెట్టేవారు ఎవరు కూడా హోదాను కోరడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని పవన్‌ శుక్రవారం విమర్శించిన సంగతి తెలిసిందే. వెంకయ్యనాయుడు తన కూతురికి సంబంధిచిన స్వర్ణభారతి ట్రస్ట్‌పై  చూపించే శ్రధ్ధ.. ప్రత్యేక హోదా సాధనపై చూపించి ఉంటే ఈ పాటికి ఫలితాలు వచ్చి ఉండేవని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా సమావేశాల్లో వెంకయ్య ‘ప్రత్యేక హోదాను ప్రసాదిస్తాం’అని అనడాన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ‘ప్రసాదించడానికి వెంకయ్య ఏమైనా దేవుడా? మేం(తెలుగు ప్రజలం) బానిసలమా? బానిసలు తిరగబడితే తట్టుకోలేరు జాగ్రత్త..’ అని పవన్‌ హెచ్చరించారు. బీజేపీని, ముఖ్యంగా వెంకయ్యనాయుడును లక్ష్యంగా చేసుకొని పవన్‌ కల్యాణ్‌ విమర్శలు చేయడంతో ఆయనపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఫైర్‌ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య కూడా పవన్‌ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *