ఉపరాష్ర్టపతిగా వెంకయ్య నాయుడు ప్రమాణస్వీకారం

భారత 13వ ఉపరాష్ర్టపతిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ర్టపతి భవన్ లోని దర్బార్ హాల్ లో ఉపరాష్ర్టపతి ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వెంకయ్య చేత రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయా రాష్ర్టాల సీఎంలు, పలువురు నేతలతో పాటు వెంకయ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అంతకుముందు రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీ, పటేల్ చౌక్ వద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్, డీడీయూ పార్క్ వద్ద దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహానికి వెంకయ్య నివాళులర్పించారు. అనంతరం అటు నుంచి రాష్ర్టపతి భవన్ చేరుకున్న వెంకయ్య.. ఉప రాష్ర్టపతిగా ప్రమాణస్వీకారం చేశారు.

పోస్టర్లు వేసిన కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకూ.. 
భారత రాజకీయాలలో చిరపరిచితుడైన ముప్పవరపు వెంకయ్యనాయుడు బీజేపీలో పోస్టర్లు వేసే సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఉపరాష్ట్రపదవిని అలంకరించే వరకూ ఎదిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా, చవటపాలెం గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో 1949, జూలై ఒకటిన ఆయన జన్మించారు. బీజేపీకి అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా, సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. బీజేపీకి మాతృసంస్థ అయిన జనసంఘ్‌లో కార్యకర్తగా 1970లో వెంకయ్య దిగ్గజ నేతలైన అటల్‌బిహారీ వాజపేయి, ఎల్‌కే అద్వానీల పోస్టర్లు వేసేవారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొనే వెంకయ్య అనతికాలంలోనే నాయకునిగా ఎదిగారు.

ఆయన రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దాదాపు క్లీన్‌స్వీప్ చేసినప్పటికీ వెంకయ్య జనతాపార్టీ అభ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తిరిగి 1983లో ఎన్టీ రామారావు ప్రాబల్యాన్ని తట్టుకొని అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. వెంకయ్య కర్ణాటక నుంచి మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎన్నికయ్యే ముందు ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకప్పుడు అద్వానీ ముఖ్యఅనుచరునిగా ఉన్న వెంకయ్య 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థి మోదీకి మద్దతు పలికారు.

మోదీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖలు, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు కూడా మంత్రిగా పనిచేశారు. వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌లో వెంకయ్య గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా 2002 జూలై నుంచి అక్టోబర్ 2004 వరకు పనిచేశారు. 2004 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఎమర్జెన్సీ కాలంలో ఏబీవీపీ కార్యకర్తగా ఉన్న వెంకయ్య అరెస్టయి జైలు జీవితం గడిపారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉభయ సభల్లో ప్రతిపక్షం ప్రభుత్వంపై లేదా ప్రధానిపై దాడిని ఎక్కుపెట్టినప్పుడు ఆయన సమర్థవంతంగా తిప్పికొట్టేవారు.

ప్రభుత్వానికి, ప్రతిపక్షానికీ మధ్య ఎప్పుడు ప్రతిష్టంభన నెలకొన్నా, దానిని తొలిగించేందుకు ఆయన ప్రయత్నించారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో పలుమార్లు భేటీ అయిన సందర్భాలున్నాయి. వెంకయ్య పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రిగా ఉన్నప్పుడే స్మార్ట్ సిటీ మిషన్, అటల్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, అందరికీ ఇండ్లు వంటి పథకాలు ప్రారంభమయ్యాయి. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఆవిష్కరణలో కీలకపాత్ర పోషించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *