కాలమహిమ: అద్దె ఇంట్లో రేమాండ్ రారాజు

దేనికి చిక్కినా.. చిక్కకున్నా కాలానికి చిక్కాల్సిందే. రేమాండ్ రారాజుగా అందరికి సుపరిచితుడు ఇప్పుడు అద్దె ఇంట్లో కాలం వెళ్లదీసే దుస్థితి. అప్పుల ఊబిలో చిక్కుకొని.. ఆర్థిక ఇబ్బందుల్లో కాలం వెళ్లదీయాల్సి రావటమంటే  అది  కచ్ఛితంగా కాల మహిమనే చెప్పాలి. దశాబ్దాలుగా రేమాండ్ పేరుతో దుస్తుల రంగంలో తిరుగులేని రీతిలో తీసుకెళ్లిన  ఆ బ్రాండ్ రారాజు.. పారిశ్రామిక దిగ్గజం ఇప్పుడు దారుణ పరిస్థితుల్లో ఉన్న వైనం సంచలనంగా మారింది. 78 ఏళ్ల వయసులో డబ్బు కోసం ఆయన కటకటలాడుతున్నారు. అయితే.. ఈ కష్టాలన్నింటికి కారణం ఆయన వంశోద్దారకుడే కావటం మరో విశేషం. విజయ్ పథ్ సింఘానికా కుమారుడు గౌతమ్ సింఘానియా పుణ్యమా అని ఒకప్పటి రేమాండ్ రారాజు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయినట్లు చెబుతున్నారు.

మరీ విషయం ఇప్పుడెలా బయటకు వచ్చిందంటే.. విజయ్ పథ్ సింఘానియా కోర్టు మెట్లు ఎక్కటంతో ఈ విషయం బయటకు వచ్చింది. తన కొడుకు వ్యవహరించిన తీరుతో తానెన్ని ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన తన న్యాయవాది ద్వారా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తన ఆస్తి మొత్తాన్ని లాగేసుకున్న కొడుకు.. తనను ఇప్పుడు దక్షిణ ముంబయిలోని గ్రాండ్ పరాడీ సొసైటీలోని ఓ అద్దె ఇంట్లో ఉండేలా చేశాడని.. అంత ఆస్తి ఉన్నా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందని కోర్టుకు విన్నవించాడు.

ముంబయిలోని సంపన్నుల ప్రాంతంగా చెప్పే మలబార్ హిల్స్ లో విజయ్ పథ్ సింఘానికి నిర్మించిన 36 అంతస్థుల జేకే హౌస్ లో తనకు రావాల్సిన డ్యూప్లెక్స్ ఇంటి కోసం ఆయన ఇప్పుడు న్యాయపోరాటానికి దిగారు. వాస్తవానికి విజయ్ పథ్ సింఘానికియాకు కంపెనీ నుంచి నెలకు రూ.7లక్షల చొప్పున రావాల్సి ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. అంతేకాదు.. కంపెనీ ఖర్చులతో ఆయన ప్రత్యామ్నాయ నివాస వసతిని సమకూర్చాల్సి ఉన్నప్పటికీ అవేమీ జరగటం లేదు. దీంతో.. ఆయన కోర్టును ఆశ్రయించారు. నాటి రేమాండ్ రారాజు కోర్టు మెట్లు ఎక్కటంతో.. ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ రేమాండ్ సంస్థను కోర్టు కోరింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *