విరాట్ మరో రికార్డు బ్రేక్ చేశాడు!

విశాఖ: ఒకవైపు పరుగుల దాహం..మరొకవైపు రికార్డుల వేట. ఈ పేరుకు కచ్చితంగా సరిపోయే ఒకే ఒక్క క్రికెటర్ విరాట్ కోహ్లి.  గతంలో వన్డేల్లో వేగంగా 20 సెంచరీలు, ఐదు వేల పరుగులులాంటి  ఘనతలను బ్రేక్ చేసిన కోహ్లి.. ఈ ఏడాది  టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ ఘనతను సాధించిన తొలి భారత కెప్టెన్ గా విరాట్ కోహ్లి నిలిచాడు.  ప్రధానంగా ఈ ఏడాది ఐపీఎల్ లో అత్యధిక పరుగుల చేసిన రికార్డు దగ్గర్నుంచీ,  ఈ రోజు వరకూ ఆ పరుగుల యత్రం వెనుదిరిగి చూసింది చాలా తక్కువ.

తాజాగా ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో కూడా విరాట్ తనదైన ముద్రతో చెలరేగిపోతున్నాడు. తొలి టెస్టులో 40, 49 పరుగులతో ఆకట్టుకున్న కోహ్లి.. రెండో టెస్టులో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు.  ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 167 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులతో మెరిశాడు. దాంతో ఈ రెండు ఇన్నింగ్స్ లో కలిపి విరాట్ 248 పరుగులు నమోదు చేశాడు. తద్వారా మరో రికార్డు విరాట్ పేరిట లిఖించబడింది. ఇంగ్లండ్పై ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా విరాట్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు భారత కెప్టెన్ గా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఒక మ్యాచ్ లో నమోదు చేసిన 216 పరుగుల రికార్డును విరాట్ బద్ధలు కొట్టాడు.

ఇంగ్లండ్ తో రెండో టెస్టులో భారత్ 246 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *