కోచ్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌…?

ఇండియ‌న్ టీమ్ హెడ్ కోచ్ ఎంపిక‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఉత్కంఠ రేపుతున్నాయి. నిజానికి సోమ‌వార‌మే కోచ్ ఎవ‌రో తేలాల్సి ఉన్నా.. త‌మ‌కు ఇంకా టైమ్ కావాలంటూ సీఏసీ హెడ్ గంగూలీ చెప్పాడు. నిన్న ఐదుగురి ఇంట‌ర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. ర‌విశాస్త్రే ఫేవ‌రెట్‌.. ఇక అత‌నికి కోచ్ ప‌ద‌వి అప్ప‌గించ‌డం లాంచ‌న‌మే అనుకున్న స‌మ‌యంలో మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు దాదా. ఒక‌వేళ శాస్త్రినే కోచ్‌గా చేయాల‌నుకుంటే కెప్టెన్ కోహ్లితో మాట్లాడాల్సిన అవ‌స‌రం లేదు కదా అన్న సందేహాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. సీఏసీ ర‌విశాస్త్రి కంటే సెహ్వాగ్‌వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు తాజాగా మ‌రో స‌మాచారం. సోమ‌వారం నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూల్లో ఇండియ‌న్ క్రికెట్ భ‌విష్య‌త్తుపై సెహ్వాగ్ విజ‌న్ సీఏసీలోని ముగ్గురు దిగ్గ‌జాల‌ను ఆక‌ట్టుకున్న‌ట్లు బోర్డు వర్గాలు వెల్ల‌డించాయి. చివ‌రి నిమిషంలో ట్విస్ట్ రావ‌డంతో త‌మ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌కుండా కెప్టెన్‌తో మాట్లాడాలి అని గంగూలీ అందుకే అన్న‌ట్లు స‌మాచారం.

సీఏసీ సెహ్వాగ్‌నే కోచ్‌గా చేయాల‌ని దాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. ఇదే విష‌యాన్ని కోహ్లికి వివ‌రంగా చెప్పాల‌ని సీఏసీ భావిస్తున్న‌ది. అంతమాత్రాన అత‌ని ఆమోదం కోసం ఎదురు చూసిన‌ట్లు కూడా కాద‌ని బోర్డులోని ఓ సీనియ‌ర్ అధికారి అన్నారు. కోచ్‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో విరాట్ తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గంగూలీ అన‌డం చూస్తే.. నువ్వు కోరుకున్న వ్య‌క్తిని ఇవ్వ‌డం కుద‌ర‌దు అని ప‌రోక్షంగా కోహ్లికి చెప్పిన‌ట్లే. అంతేకాదు కొత్త కోచ్ విజ‌న్‌పై విరాట్‌కు వివ‌రించాల‌ని కూడా సీఏసీ భావిస్తున్న‌ది. ఇవ‌న్నీ చూస్తుంటే.. ర‌విశాస్త్రి రేసులో నుంచి త‌ప్పుకున్న‌ట్లే క‌నిపిస్తున్న‌ది. కోచ్ ఎంపిక విష‌యంలో బీసీసీఐ కూడా సీఏసీకే పూర్తిగా అధికారాలు ఇచ్చేసింది. అందులో గంగూలీ మాటే ఫైన‌ల్‌. దీంతో ఊహించిన‌ట్లే త‌న‌కు అస్స‌లు న‌చ్చ‌ని ర‌విశాస్త్రిని మ‌రోసారి త‌ప్పించ‌డంలో గంగూలీ విజ‌య‌వంతం అయిన‌ట్లే క‌నిపిస్తున్న‌ది.

కోహ్లితో చర్చించిన తర్వాతే…
కోచ్‌ పేరును ప్రకటించే ముందు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో కచ్చితంగా చర్చిస్తామని గంగూలీ వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు మాత్రం కోహ్లి తమ పనిలో కలగజేసుకోలేదని, కోచ్‌గా ఎవరు ఉండాలనే పేరును కూడా సూచించలేదని ఆయన అన్నారు. ‘కోచ్‌ ఎవరితో కలిసి పని చేయాల్సి ఉంటుందో అలాంటి వారితో మాట్లాడటం కూడా చాలా అవసరం. అతను 2019 ప్రపంచ కప్‌ వరకు ఉండాల్సి ఉంటుంది.

ఆరు నెలల తర్వాత అభిప్రాయ భేదాలు రాకూడదు కదా. ఎంపికతో మా పాత్ర ముగిసిపోతుంది కానీ జట్టును ముందుకు నడిపించాల్సింది కెప్టెన్, కోచ్, ఆటగాళ్లు మాత్రమే’ అని ‘దాదా’ చెప్పారు. అలాగే ‘కోచ్‌లు ఎలా పని చేస్తారో కూడా కోహ్లి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది’ అంటూ పరోక్షంగా చురక కూడా అంటించారు. కోహ్లి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. అతను ఈ నెల 17న భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది.

శాస్త్రికి కష్టమేనా?
ఇంటర్వ్యూకు ముందు వరకు కూడా రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికవుతారని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే అంతర్గత సమాచారం ప్రకారం ఇంటర్వ్యూలు ముగిశాక రవిశాస్త్రికి మరీ అనుకూల వాతావరణం ఏమీ లేదు. అసలు కోచ్‌ పేరును నేరుగా ప్రకటించకుండా కోహ్లిని భాగస్వామిగా చేయడంలోనే సీఏసీ చాలా తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా తమ నిర్ణయం కాదని, రేపు కుంబ్లే తరహాలో ఏదైనా జరిగితే కోహ్లిదే బాధ్యత అని కమిటీ చెప్పకనే చెప్పింది. బీసీసీఐలోని ఒక వర్గం చెబుతున్న ప్రకారం… కోహ్లి ముందు సీఏసీ రెండు ప్రత్యామ్నాయాలు ఉంచి అందులో ఒకరిని ఎంపిక చేసుకోమని కోరుతున్నట్లు సమాచారం. అయితే అందులో శాస్త్రి పేరు కాకుండా సెహ్వాగ్, టామ్‌ మూడీ పేర్లు ఉన్నాయని వారు అంటున్నారు!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *